ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశించి ‘జనసంఖ్య నిర్వహణ విధానం’ (Population Management Policy) పై కీలక ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) 1.5కి పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది ఇలాగే కొనసాగితే 2047 నాటికి ఏపీ వృద్ధుల రాష్ట్రంగా మారిపోయే ప్రమాదం ఉందని గణాంకాలతో హెచ్చరించారు. గతంలో జనాభా నియంత్రణకు ప్రాధాన్యతనిచ్చిన తానే, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు జనాభా సమతుల్యత కోసం కుటుంబాలు పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనను తొలగిస్తూ చట్ట సవరణ చేస్తామని ప్రకటించారు. ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, విద్య, వైద్యంలో ప్రాధాన్యత కల్పించేలా ‘క్యాష్ ఫర్ కిడ్స్’ వంటి వినూత్న పథకాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.